ఏపీ ముస్లిం మైనార్టీలకు సీఎం వరాల జల్లు..

22:35 - August 28, 2018

ఏపీ ముస్లిం మైనార్టీలకు సీఎం వరాల జల్లు కురిపించారు. గుంటూరులో జరిగిన ‘నారా హమారా.. టీడీపీ హమారా’ బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు సాధించే బాధ్యత టీడీపీదేనని, మూడు వేలకు పైగా ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో ఖాజీ ఏర్పాటు చేయమన్నారని, ముస్లిం సోదరులకు ఆమోదమైతే ప్రభుత్వ ఖాజీలను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

ఏపీ వ్యాప్తంగా దర్గాల అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేస్తామని, ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో పోస్టులను భర్తీ చేస్తామని, మైనార్టీలకు అదనంగా 25 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

కడప, విజయవాడలలో హజ్ హౌస్ లు నిర్మిస్తున్నామని, పోస్టు మెట్రిక్, ప్రీ మెట్రిక్ ఉపకారవేతనాలు అందజేస్తున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. మైనార్టీలకు స్వయం ఉపాధి కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టామని, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నేతృత్వంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేశామని, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు.