ఉద్యోగులని బలి తీసుకోనున్న బీఎస్‌ఎన్‌ఎల్‌? : 50 వేలమందికి పైగా ఉద్వాసన

03:38 - April 4, 2019

*జియో దెబ్బకు కుదేలైన  బీఎస్‌ఎన్‌ఎల్‌ 

*జీతభత్యాల చెల్లింపుల కోసం వేల కోట్ల రూపాయల అప్పులు

*వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్దం 

 

 

జియో భారతీయ టెలీకాం దిగ్గజాల్లో ఒకరైన ముఖేష్ అంబాని సంస్థ. ఈ మధ్యకాలంలో భారతీయ టెలీకాం రంగాన్ని ఇంత దారుణంగా దెబ్బ తీసిన సంస్థ మరొకటి లేదనే చెప్పాలి. జియో రాకతో మిగతా సర్వీస్ ప్రొవైడర్ల సంగతి ఎలా ఉన్నా  ప్రభుత్వ రంగ టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్  (బీఎస్‌ఎన్‌ఎల్‌) ఇంతకు ముందెన్నడూ లేనంతగా కూలబడిపోయింది. ఒకరకంగా పూర్తిగా దివాళా తీసే స్థితికి చేరుకున్నదనే చెప్పుకోవాలి. జియో దెబ్బకు విలవిల్లాడిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఖరికి తన ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దీనావస్థకు చేరుకుంది. జీతభత్యాల చెల్లింపుల కోసం వేల కోట్ల రూపాయలను అప్పు చేయాల్సిన పరిస్థితిలోకి నెట్టివేయబడింది.
         

ఇదంతా ఓక ఎత్తయితే తాజాగా వినిపిస్తున్న మాట బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉధ్యోగులని మరీ నిరాశలోకి నెట్టేదిగా ఉంది. ఇప్పుడు జరగనున్న లోక్ సభ ఎన్నికల అనంతరం సంస్థలో వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది. దీనిపై ఎన్నికల అనంతరం తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది విశ్వసనీయ సమాచారమేనని ఉధ్యోగులు కూడా ఒక నిశ్చయానికి వచ్చేశారు. తమ సంస్థ త్వరలో తమని బయటికి పంపనుందనే చర్చ ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉధ్యోగుల్లో వినిపిస్తోంది.

                                                             

దేశవ్యాప్తంగా సంస్థలోని ఒకటీరెండు కాదు ఏకంగా 54వేలవరకూ ఉద్యోగులకు ఉద్వాసన పలికే  ప్రతిపాదనకు బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ఆమోదం తెలిపినట్లు సమాచారం. మార్చి నెలలో నిర్వహించిన బోర్డు సమావేశంలోఈ మేరకు సంస్థ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు మొత్తం పది ప్రతిపాదనలను సూచించగా. అందులో మూడింటికి బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ఆమోదించింది. పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలకు తగ్గించడం, అలాగే 50 సంవత్సరాల పైబడిన ఉద్యోగులందరినీ స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) కింద ఇంటికి పంపించడం, మూడవ ప్రతిపాదనగా 4జీ స్పెక్ట్రం కేటాయించాలని నిర్ణయించింది. ఈ నిర్నయాల వలన మొత్తం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల్లో 31శాతం అంటే సుమారు 54,451వేల మందిపై ఈ ప్రభావం పడనుంది. 

                                                                

బీఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ ఉద్యోగులకు  వీఆర్‌ఎస్‌ పథకం అమలు ఆమోదానికి  టెలికాం విభాగం క్యాబినెట్‌ నోట్‌ను తయారు చేస్తోంది. అలాగే ఎలక్షన్‌ కమిషన్‌ ప్రత్యేక అనుమతిని కోరనుందని సీనియర్‌ అధికారి ఒకరుతెలిపారు  వీఆర్‌ఎస్‌ పథకానికి 10 సంవత్సరాల బాండ్లను జారీచేయనుంది. గుజరాత్ మోడల్ కింద,  వీఆర్‌ఎస్‌  తీసుకుంటున్న ఉద్యోగులకు పూర్తయిన ప్రతి సంవత్సరానికి 35 రోజుల జీతంతో సమానమైన  మొత్తం, అలాగే  ఇంకా మిగిలిన ఉన్నసర్వీసులో ప్రతి సంవత్సరానికి 25 రోజుల వేతనాన్ని చెల్లించాలని ఇరు సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి.

                                                 

కాగా, తీవ్ర నష్టాల్లో కూరుకు పోయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు జీతాల కోసం 5 వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ టెలికాం సంస్థలో మొత్తం 1.76 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇప్పుడు వీరిలో ఎంతమంది ఉధ్యోగుల భవిశ్శ్యత్తు ఎలా ఉండబోతుందో అర్థం కాక అయోమయం లో ఉన్నారు.