అయ్యప్ప ఆలయంలోకి మొత్తం 51మంది: అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన మహిళల సంఖ్య

03:42 - January 19, 2019

మహిళలూ ఆలయం లోకి ప్రవేశించవచ్చు అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు 50 ఏళ్ల లోపున్న 51 మంది మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారట. ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వం స్వయంగా సుప్రీంకోర్టుకు తెలిపింది. అందుకు సంబంధించిన జాబితాను కోర్టుకు అందజేసింది. 

ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన విషయం మాత్రమే అందరికి తెలిసింది. 42 ఏళ్ల బిందు అమ్మిని, 41 ఏళ్ల కనకదుర్గ. 2వ తేదీ తెల్లవారుజామున అయ్యప్పను దర్శించుకోవడం పెను వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై కేరళలో ఆందోళనల ప్రభావం ఇంకా ఉంది. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు ప్రవేశించరాదని ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు 2018, సెప్టెంబర్‌లో కొట్టివేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ సంవత్సరం అయ్యప్ప ఆలయ ప్రవేశం కోసం మొత్తం దేశవ్యాప్తంగా 16 లక్షల మంది భక్తులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 7 వేల మంది మహిళలు ఉన్నారని కోర్టుకు తెలిపింది. దాదాపుగా వారంతా 50 ఏళ్ల లోపువారేనని పేర్కొంది. మొత్తం 16 లక్షల మందిలో 8.2 లక్షల మంది స్వామిని దర్శించుకున్నారని, దరఖాస్తు చేసుకున్న ఏడువేల మంది మహిళల్లో ఆలయంలోకి ప్రవేశించినది మాత్రం 51 మందేనని వివరించింది. వారి ఆలయ ప్రవేశం సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని పేర్కొంది. అయితే అనధికారిక లెక్కల ప్రకారం మాత్రం ఈ లెక్క అంతు చిక్కటం లేదు. అంటే అన్ని అడ్డంకులూ దాటి ఏ రకమైన కాంట్రవర్సీలో పడిన వాళ్ళకంటే గుట్టు చప్పుడు కాకుండా అయ్యప్పని దర్శిచుకున్న వాళ్ళే ఎక్కువ. 
 
2018లో 44 లక్షల మంది అయ్యప్పను దర్శించుకున్నారని ప్రభుత్వ తరపు న్యాయవాది విజయ్ హన్సారియా తెలిపారు. శబరిమల ఆలయంలోకి తొలుత ప్రవేశించిన ఇద్దరు మహిళలు కనకదుర్గ, బిందులు తమకు భద్రత కల్పించాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాలను వివరిస్తూ ఆలయంలోకి ప్రవేశించిన వారి మహిళల జాబితాను కోర్టుకు అందజేసింది. ఇప్పటి వరకూ అక్కడ ఉన్న ఆరెస్సెస్, బీజేపీలతో పాడు స్థానికులు కూడా మహిళా భక్తురాళ్ళు ఆలయంలోకి వెళ్ళకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయినా సరే 51 మంది మహిళలు వాళ్లని ఎదిరించి మరీ అయ్యప్ప దర్శనం చేసుకున్నారు.