శతాబ్దపు రక్తపుమరక: జలియన్ వాలా భాగ్

11:25 - April 13, 2019

*జ‌లియ‌న్ వాలాబాగ్ ఘ‌ట‌న‌కు వందేళ్లు 

*బ్రిటీషర్లు చేసిన ఓ సిగ్గులేని చర్య:  బ్రిటన్ మాజీ ప్రధాని

*బ్రిటీష్ హై క‌మిష‌న‌ర్ స‌ర్ డామినిక్ అస్క్విత్ పుష్ప‌గుచ్ఛ నివాళి

 

వలస పాలన వికృత రూపం, రక్తాన్ని పారించించిన చీకటి ఘట్టం భారత దేశ చరిత్రలోనే అత్యంత విషాద ఘట్టాలలో ఒకటి, ఒకనాడు జరిగిందని చెప్పబడే కురుక్షేత్రం తర్వాత మళ్ళీ అంతటి రక్తం పారిందా అన్నట్టు కుప్పలు పడిన శవాల గుట్టలు. "జలియన్ వాలా భాగ్" భారత చేరిత్రలో ఒక ఆరని నెత్తుటి మరక. సరిగ్గా వంద సంవత్సరాల క్రితం, ఇదే రోజున (1919 ఏప్రిల్ 13) బ్రిటిష్ బ్రిగేడియర్ జనరల్ రెజినాల్‌డ్ డయ్యర్ అత్యంత కిరాతక చర్యకు పాల్పడ్డాడు.

భారత స్వతంత్ర  సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన ఇది. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట. పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖీ ఉత్సవం సందర్భంగా వేలాది మంది 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్‌‌కు చేరుకున్నారు. అయితే, ఇదే ఉత్సవాల్లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చి రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జాతీయోద్యమకారులు సైతం ఇందులో పాల్గొన్నారు.

                                                 

ప్రజలను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే రౌలత్ చట్టాన్ని బ్రిటిషర్లు తీసుకురావడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇందులో భాగంగా డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యాపాల్‌ను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. జలియన్ వాలాబాగ్‌లోనూ వారి అరెస్టులను ఖండిస్తూ సంఘీభావం తెలిపారు. 


 ఇదే సమయంలో బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ నాయకత్వంలో అక్కడ సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. కొన్ని వందల మంది చనిపోయారన్నది నిర్వివాదాంశం.

                                   

నిరాయుధులు, అమాయకులు, శాంతియుతంగా సమావేశమవుతున్న వారిపై కాల్పులకు ఆదేశించడం ఎంత ఘోరం! జనరల్‌ డయ్యర్ అలా అమానుష ఉన్మాదానికి పాల్పడడంలో నిరంకుశ పాలకుడైన పంజాబ్ గవర్నర్ మైఖెల్ ఓ డయ్యర్ మద్దతు ఎంతైనా ఉన్నది. ఆ తోడ్పాటు వల్లే డయ్యర్ సేనాని ఉన్మాదం మరణ మృదంగంగా పరిణమించింది.


  ఆనాటి భయంకర ఉదంతానికి బ్రిటిష్ ప్రధాని థెరెసా మే క్షమాపణలు చెప్పాలని కోరుతూ భారత సంతతి ఎంపీ వీరేంద్ర శర్మ బ్రిటన్ పార్లమెంట్‌లో 2017 అక్టోబరు 19న తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మద్దతుగా ఐదుగురు ఎంపీల సంతకాలను కూడా వీరేంద్ర శర్మ సేకరించారు. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని మలుపు తిప్పిన జలియన్ వాలా బాగ్ ఘటనను బ్రిటన్ ప్రభుత్వం గుర్తించాలని ఆయన ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

                                                  

జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగి 2019కి వందేళ్లు పూర్తి కావొస్తున్న సందర్భంగా బ్రిటన్ ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాట్లు తెలుస్తుంది. బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కేమెరూన్ భారత్ పర్యటనకు వచ్చినపుడు జలియన్ వాలా బాగ్ ఉదంతాన్ని బ్రిటీషర్లు చేసిన ఓ సిగ్గులేని చర్యగా అభివర్ణించారు.

                                                                 
ఈ నేప‌థ్యంలో ఇవాళ అమృత్‌స‌ర్‌లో ఉన్న జ‌లియ‌న్ వాలాబాగ్ స్మార‌కం వ‌ద్ద నివాళ్లు అర్పిస్తున్నారు. బ్రిటీష్ హై క‌మిష‌న‌ర్ స‌ర్ డామినిక్ అస్క్విత్ పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. స్మార‌కం వ‌ద్ద ఉన్న విజిట‌ర్స్ బుక్‌లో కూడా ఆయ‌న సంత‌కం చేశారు. 1997లోనూ క్వీన్ ఎలిజ‌బెత్ జ‌లియ‌న్‌వాలాబాగ్‌ను విజిట్ చేసి నివాళి అర్పించారు. అయితే జలియన్‌వాలాబాగ్‌ మారణకాండ బ్రిటిష్‌ ఇండియన్‌ చరిత్రలోనే సిగ్గుచేటుగా వ్యాఖ్యానించిన బ్రిటిష్‌ ప్రధాని థెరిసా మే అధికారికంగా మాత్రం ఎలాంటి క్షమాపణ చెప్పలేదు.