వెంటనే తేలిపోవటానికి ఇది బాక్సింగ్ మ్యాచ్ కాదు : "రా" మాజీ చీఫ్ వ్యాఖ్యలు

01:37 - February 18, 2019

*అటో ఇటో వెంటనే తేలటానికి  బాక్సింగ్ మ్యాచ్ కాదు 

*భద్రతాలోపం లేకుండా ఇంత పెద్ద దాడి  అసాధ్యం

*పుల్వామా ఎటాక్ పై  భారత గూఢచార సంస్థ మాజీ చీఫ్ విక్రమ్ సూద్ 

 

భారత దేశం మొత్తం పాక్ పై ప్రతీకారం జరగాల్సిందే అంటూ నినదిస్తున్న వేళ  భారత గూఢచార సంస్థ (Research and Analysis Wing-RAW) మాజీ చీఫ్ మాత్రం కాస్త ఆలోచించండి అంటూ స్పందించారు. భద్రతాలోపాలని గమనించకుండా యుద్దం, యుద్దం అంటూ మాట్లాడవద్దని సూచించారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశానని, బదులు ఎలా తీర్చుకుంటారో ఇక వారే నిర్ణయించుకోవాలన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలను విక్రం తప్పుబట్టారు. రేపే, మాపో తేలిపోవడానికి ఇదేమీ బాక్సింగ్ మ్యాచ్ కాదని స్పష్టం చేశారు. భారత్ భద్రతా లోపమే ఈ ఘటనకు కారణమని,భద్రతా లోపం లేకుండా ఇటువంటి ఘటన జరగడానికి ఆస్కారమే లేదని తేల్చిచెప్పారు. సెక్యూరిటీ బాధ్యతల్లో పొరపాటు జరిగిఉంటుందనీ ఆయన అభిప్రాయపడ్డారు.. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన విక్రమ్ మీడియాతో మాట్లాడుతూ.. 


‘తప్పు ఎక్కడ జరిగిందీ అంటే ఖచ్చితంగా చెప్పలేను కానీ  భద్రతాలోపం లేకుండా ఇంత పెద్ద దాడి జరగడం మాత్రం అసాధ్యం, నిజానికి ఈ దాడిలో ఒకరి కంటే ఎక్కువ మందే పాల్గొని ఉండొచ్చు. ఎవరో ఒకరు తెచ్చి ఇవ్వకపోయి ఉంటే అంత పెద్దమొత్తంలో పేలుడు పదార్థాలను ఆ ఒక్కడు తనంతట తాను సేకరించగలిగి ఉండేవాడే కాదు, సైనిక కాన్వాయ్ కదలిక గురించి కూడా వాళ్ళకి ముందే సమాచారం ఉండేఉంటుంది లేదంటే ఇంత పక్కా ప్లాన్ సాధ్యమయ్యే పని కాదు" అంటూ ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు.
 
సైనిక కాన్వాయ్‌ ప్రతీ కదలికా ముందే తెలిసి పై దాడి ఎక్కడ చేయాలన్న విషయం కూడా ప్లాన్ చేసుకొని మరీ వాళ్ళు సిద్దపడ్డారనీ, ఒ గ్రూప్ మొత్తం ఈ దాడికోసం పని చేసి ఉంటుందనీ, చివరి ఉగ్రవాది మాత్రం ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉంటాడని వివరించారు. అయితే చివరలో ఇలా అని ఖచ్చితమైన అభిప్రాయానికి రాలేము అంటూ చెప్పారు.