సినిమా మనసు ఏమో గానీ..నిజ జీవితంలో మనసులను గెలిచాడు శర్వా

17:24 - December 25, 2018

నిజాలు ఒప్పుకోవడానికి సాధారణంగా ఎవరికీ మనసు అంగీకరించదు. అది మానవ నైజం. సహజం కూడా. హిపోక్రసీ రాజ్యమేలే సినిమా పరిశ్రమలో ఇది ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది . సినిమా బాగోకపోయినా, ఎంత డిజాస్టర్‌ వచ్చినా వారు తీసిన సినిమాని పబ్లిసిటీ కోసం పాజిటీవ్‌గానే చెబుతుంటారు.  గత ఏడాది ఓ దర్శకుడు ఇదే విషయంలో స్టేజి మీదే టెంపర్ కోల్పోయి ఏదేదో అరిచేసాడు. కట్ చేస్తే సినిమా ఫ్రీగా చూసే యుట్యూబ్ లో హిట్ అయ్యింది ధియేటర్లలో ఫ్లాప్ అయ్యింది. ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కాని శర్వానంద్ మాత్రం ఈ విషయంలో తాను వేరే అని నిజాయితి ఉన్నవాడినని ప్రూవ్ చేసుకున్నాడు. మహానుభావుడు తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని చేసిన పడి పడి లేచే మనసు పరాజయం పాలైన విషయాన్ని శర్వానంద్ నిజాయితిగా ఒప్పుకున్నాడు. చాలా గొప్ప సినిమా తీసామని అనుకున్నానని అయితే తన కెరీర్ లో ఎంత స్పెషల్ గా నిలిచినా అందరిని మెప్పించలేకపోయినందుకు క్షమించమని మరోసారి ఇవి రిపీట్ కాకుండా చూసుకుంటానని చెప్పాడు. అంతే కాదు క్రిటిక్స్ వెలిబుచ్చిన అభిప్రాయాలు చదివానని తప్పు పట్టడానికి ఏమి లేదని వాళ్ళను గౌరవిస్తూ సరిదిద్దుకునే ప్రయత్నం వచ్చే సినిమా నుంచే చేస్తానని చెప్పేసాడు. వీలైతే కాస్త పుష్ చేయమని స్వచ్చంగా మీడియాను రిక్వెస్ట్ చేసిన శర్వా సక్సెస్ మీట్ స్టేజి మీదే ఇలా మాట్లాడి సినిమా మనసు ఏమో కాని నిజ జీవితంలో మనసులు మాత్రం గెలిచేసుకున్నాడు.