సంతోష్ ఏమయ్యాడు: పోలిసులే...?

13:44 - January 5, 2019

అరెస్ట్ అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ కిడ్నాప్ చేస్తే? అదీ ఆ కిడ్నాపర్లు పోలీసులే అయితే?? ఎవరికి చెప్పాలి ఏం చేయాలి? గత కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస అరెస్టులు, అక్రమ నిర్భంధాలేనని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ జనవరి రెండవ తేదీ సాయంత్రం విరసం సభ్యుడూ, కవీ, PDSU నుంచి వచ్చే "విజృంబన" పత్రిక సంపాదకుడూ అయిన వీ.సంతోష్ ను పోలీసులు అనధికారికంగా అదుపులోకి తీసుకున్నారనీ, ఆతర్వాత అతన్ని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారనీ ఆరోపణలు వస్తున్నాయి. 

"యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి


    విరసం  సభ్యుడు కామ్రేడ్‌ సంతోష్‌ను హైదరాబాదులోని మలక్‌పేట ప్రాంతంలో నిన్న(డిసెంబర్‌4) సాయంకాలం పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. గత రెండు రోజుల కింద కార్మిక, రైతాంగ కార్యకర్తల అక్రమ అరెస్టులకు నిరసగాన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న తర్వాత బైటికి వెళ్లిన సంతోష్‌ను అరెస్టు చేశారు. విప్లవ విద్యార్థి ఉద్యమంలో పీడీఎస్‌యూ  నాయకుడిగా సంతోష్‌ చాలా కాలంగా పని చేస్తున్నాడు. కవిత్వమంటే చాలా ఇష్టం. అనేక పనుల మధ్యనే కవిత్వం రాస్తూ విప్లవ రచయితల సంఘంలోకి వచ్చాడు. ఇటీవలే వసంత మేఘం పేరుతో కవితా సంపుటి అచ్చేశాడు. విరసంలో ఈ తరం కవులకు, కవిత్వానికి కా. సంతోష్‌ ఒక ఉదాహరణ. అనేక రాజకీయ సామాజిక విశ్లేషణ వ్యాసాలు కూడా రాశాడు. 

    తెలంగాణలో ప్రజా ఆకాంక్షలను కాలరాస్తున్న కేసీఆర్‌  రెండోసారి అధికారంలోకి వచ్చాక మరింత పేట్రేగిపోతున్నాడు. నిర్బంధమే అధికార విధానంగా సాగిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి యువజనులు ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు. కా. సంతోష్‌ అప్పుడూ, ఇప్పుడూ విద్యార్థి ఉద్యమంలో భాగంగా పాలక విధానాలకు, వివక్షలకు, దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. రాస్తున్నాడు. అందుకే ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశారు. 
    కవులు, రచయితలు, మేధావులపై దేశవ్యాప్తంగా పెరిగిపోయిన నిర్బంధంలో, ప్రజా సంఘాలపై అమలవుతున్న దారుణ అణచివేతలో భాగమే కా. సంతోష్‌ అరెస్టు. తనను విడుదల చేయాలని సాహిత్యకారులు, బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విరసం విజ్ఞప్తి చేస్తోంది. 
                                                                                  పాణి, విరసం కార్యదర్శి" 
విరసం మాత్రమే కాకుండా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ACF) రాష్ట్ర కమిటీ కూడా ఈ మేరకు సంతోష్ ని వెంటనే విడుదల చేయాలంటూ ఒక ప్రకటన చేసింది. ఇప్పటికీ అరెస్టుని అధికరికంగా పోలిసులు దృవీకరించక పోవటం, పోలీసుల పనే అని ప్రజా సంఘాల ఆరోపణల నేపథ్యం లో సంతోష్ అసలు ఎక్కడ ఉన్నాడు? ఏమయ్యాడు? అన్న అనుమానాలు వస్తున్నాయి.