శరణు "ఘోష": 11 మంది తెలంగాణ అయ్యప్ప భక్తుల మరణం

05:23 - January 7, 2019

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుదుకొట్టై సమీపంలో ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో పదిమంది అయ్యప్ప స్వామి భక్తులు దుర్మరణం పాలైయ్యారు. మరో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.పుదుకోట్టై సమీపంలో కంటైనర్ లారీ టెంపో వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన పదిమంది అయ్యప్ప భక్తులు చనిపోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఐదుగుర్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారి పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

మృతులు మెదక్‌ జిల్లా నర్సాపురం మండలానికి చెందిన నాగరాజు, మహేష్‌, శ్యామ్‌, కుమార్‌, ప్రవీణ్‌, కృష్ణసాయి, ఆంజనేయులు, సురేష్‌ ఉన్నారు. వీరితో పాటు డ్రైవర్‌ కూడా మృతి చెందాడు. అయ్యప్ప భక్తులు శబరిమల నుంచి తిరిగి సొంత ఊరికి వెళ్తుండగా. రామేశ్వరం-తిరుచ్చి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. కంటైనర్ రాంగ్ రూట్‌లో ఒక్కసారిగా రోడ్డుపై రావడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం గురించి తెలియగానే తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ భాస్కర్ క్షతగాత్రులు చికిత్సపొందుతున్న ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితుల్ని పరామర్శించి. మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. 

తమిళనాడు జరిగిన రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీష్‌ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే పుదుకొట్టై జిల్లా కలెక్టర్‌ గణేష్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. మృతదేహాలను వారి స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ను కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరగటం దురదృష్టకరమని, వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తంచేశారు.