రోడ్డుమీదే అంత్య క్రియలు: రహదారినే స్మశానం చేసారు ఎందుకంటే?

10:59 - January 5, 2019

భూమ్మీద పుట్టిన ప్రతీ మనిషికీ బతకటానికీ భూమి అవసరమే. మరి చనిపోవటానికి? ఎలక్ట్రిక క్రిమేషన్ పద్దతులు వచ్చినా ఇంకా అందరికీ అందుబాటులో లేకపోవటం. మరికొందరి ఆచారాల ప్రకారం ఆ పద్దతి నచ్చకపోవటం వల్ల ఇంకా స్మాశానానికి భూమి అవసరం ఉంటూనే వచ్చింది. ఇప్పటికి గ్రామాల్లో అయితే ఏ కులానికి ఆకులం, ఏ మతానికి ఆమతాల వారీగా స్మశానవాటికలు వేరు వేరుగానే ఉంటున్నాయి. ఇప్పుడు కర్ణాటకలోనూ అదే సమస్య. పలుమార్లు తమకో స్మశాన స్థలం కావాలని అర్జీలు పెట్టుకున్నా ఎలాంటి ప్రయోజనమూ లేకపోవటం తో ఆగ్రహం వచ్చిన గ్రామస్తులు నడీరోడ్డు మీదే శవాలను ఖననం చేసి తమ నిరసన తెలియజేసారు. ఇది ఆప్రాంత ప్రజలమధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. 
  శ్మశానానికి స్థలం చూపాలని జిల్లా అధికారులను పలుమార్లు కోరినా ఫలితం లేనందున ఏకంగా రోడ్డుపైనే అంత్యక్రియలు జరిపి నిరసన తెలిపిన సంఘటన కర్ణాతక గదగ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గదగ్‌ జిల్లా హాతలగేరి గ్రామంలో శ్మశానానికి ప్రత్యేకంగా స్థలం కేటాయింపులు లేవు. రైతులు వారి పొలాల్లోనే అంత్యక్రియలు జరుపుకునేవారు. కాగా నాలుగు రోజుల కిందట ఒకే రోజున ఉదయం చెన్నబసప్ప, మధ్యాహ్నం యల్లప్ప అనేవారు మృతి చెందారు. అయితే అంత్యక్రియలకు ప్రత్యేక స్థలం లేకపోవడంతో మృతుల కుటుంబసభ్యులు హాతలగేరి- నాగసముద్రం మార్గమధ్యంలోని ప్రధాన రహదారిపై మృతదేహాలకు దహనక్రియలు చేశారు. కానీ ఈ నిరసన మాత్రం చుట్టుపక్క ప్రజలకీ అధికారులకీ ఆగ్రహం తెప్పించింది. 
 
విషయం తెలుసుకున్న తహసీల్దారుతో పాటు అధికారులు గ్రామానికి చేరుకుని ప్రజలతో చర్చించే యత్నం చేశారు. కొన్నేళ్లుగా శ్మశానానికి స్థలం కోరుతున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడ్డారు. వెంటనే శ్మశానానికి స్థలం చూపాలన్నారు. లేదంటే మరోసారి ఇలాగే జరిగితే తహసీల్దారు కార్యాలయంలోనే అంత్యక్రియలు జరుపుతామని వారు హెచ్చరించారు. అయితే అధికారులనుంచే కాదు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా రోడ్డుపై అంత్యక్రియలు జరపడాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పటిదాకా రోడ్డుపై అంత్యక్రియలు జరిపిన దాఖలాలు లేవని పలు ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ఇంతకీ ఈసారైనా ఈ సమస్య తేలకుంటే, మరోసారి ఇదే సంఘటన చోటుచేసుకుంటే మాత్రం ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది.