యువతి హత్య కేసులో విశాఖ కోర్టు అరుదైన తీర్పు

13:10 - January 10, 2019


అతను చేసిన ఘోరానికి జడ్జీలకు కూడా మనసు చలించింది. కేవలం అనుమానంతో  అత్యంత కిరాతకంగా ఒక అమ్మాయిని హతమార్చినందుకు దోషికి రెండు యావజ్జీవ శిక్షలు విధిస్తున్నామని, ఏకకాలంలో ఈ శిక్షలు అనుభవించాలని తీర్పిచ్చింది. తీర్పువిన్న న్యాయవాదులూ, ప్రజలూ ఈ తీర్పుమీద హర్షం వ్యక్తం చేసారు. ఇంతకీ ఆ యువకుడు చేసినది అంత దారుణమైన నేరమా అంటే.... 


2017 జులై 8న పూర్ణామార్కెట్‌ సమీపంలో గల పండావీధిలో బూరలి భవాని  హత్య తీవ్ర కలకలం రేపింది. 2014 నుంచి ఆమెను ప్రేమిస్తున్న సతీష్ కుమార్ పెళ్లి చేసుకుంటానని చెప్పగా, ఇరు కుటుంబాలూ అంగీకరించి, పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగింది. ఇదే సమయంలో సతీష్ ప్రవర్తన కూడా మారింది. భవానిపై అనుమాన పడుతూ, అసభ్యకరంగా మాట్లాడటం ప్రారంభించాడు. ఆమెకు అక్రమ సంబంధం అంటగట్టాడు. అంతేకాదు ఆ అనుమానం తోనే ఆమెను చంపేసాడు. అదీ సైకో ప్రవర్తనతో. 

హత్య జరిగిన రోజు మధ్యాహ్నం భవానికి ఫోన్ చేసి తన ఇంటికి పిలిచిన సతీశ్, ఆ సమయంలో ఇంట్లో ఎవరినీ లేకుండా చేసి, హత్యకు పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో కేకలు పెడుతూ ఆమె రోడ్డుపైకి రాగా, కొందరు స్థానికులు కాపాడేందుకు ప్రయత్నిస్తే, వారిపైనా గాజుతో దాడి చేశాడు. వారు భయపడి చూస్తుండగానే, మరోసారి పొడిచాడు. ఇనుప డంబెల్ తో తలపై మోదాడు. ఆ వెంటనే భవాని ప్రాణాలు కోల్పోగా, శవాన్ని ఈడ్చుకుంటూ వచ్చాడు. ఆపై స్థానికులు ఏకమై అతన్ని చావగొట్టి పోలీసులకు అప్పగించారు.

ఈ కేసు విచారణ విశాఖ పట్తణం కోర్టులో దాదాపు ఏడాదిన్నర పాటు సాగింది. కేసులో వాదోపవాదాలు విన్న జడ్జీ రెండు యావజ్జీవ శిక్షలని ఒకేసారి అనుభవించాల్సిందిగా తీర్పునిచ్చారు.  ఒక దోషికి రెండు జీవితఖైదులు విధించడం విశాఖపట్నం చరిత్రలో అరుదైన విషయమని పలువురు న్యాయవాదులు వ్యాఖ్యానించారు.అత్యంత కిరాతక ప్రవర్తన కారణంగానే ఇలాంటి శిక్ష విధించాల్సి వచ్చిందని వారు చెబుతున్నారు. ప్రేమపేరుతో క్రూరంగా ప్రవర్తించే వ్యక్తులకు ఈ శిక్ష ఓ కనువిప్పు కావాలని అంటున్నారు.