మోడీ చూచి రాత పరీక్ష ఎదుర్కోలేక పారిపోయాడు: ప్రధాని పై రాహుల్ సెటైర్లు

15:55 - January 4, 2019

"పప్పూ" మన జాతీయ రాజకీయాల్లో ఈ మాట వినగానే గుర్తొచ్చేది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదే మాటతో నన్ను గేలి చేస్తున్నారంటూ. ప్రదాని మోడీ ముందే ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు బీజేపీ నేతలు రాహుల్ గాంఢీని మరింతగా గేలి చేస్తూ నవ్వుకున్నారు. ఇటు సోషల్ మీడియాలోనూ బీజేపీ శ్రేణులు పప్పూ.. పప్పూ.. అంటూ రాహుల్ ని అదే పనిగా ఏడిపించటానికే పూనుకున్నాయి. అయితే ఆరోజునుంచీ రాహుల్ తాను "పప్పూ" కాదని నిరూపించుకునే ప్రయత్నంలో పడ్డారు. తాజాగా రాజీవ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీనే కాక మోదీ నే ముఖాముఖి సవాల్ చేస్తున్నట్టు ఉన్నాయి. 

కేవలం 20 నిమిషాలు చాలు.. దమ్ముంటే ముఖాముఖి చర్చకు రావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్‌ విసిరిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ- ఈ అంశాన్ని వదిలిపెట్టడం లేదు. ‘‘ఆయన పార్లమెంట్‌ను వదిలి పారిపోయారు. రాఫెల్‌ చూచి రాత పరీక్షను ఎదుర్కోలేక పలాయనం చిత్తగించారు. ఇపుడు పంజాబ్‌లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు’’ అని ట్విటర్‌లో హేళన చేశారు. ‘‘నేను ప్రధానికి నాలుగు ప్రశ్నలు సంధించాను. ఆయన వాటికి బదులివ్వకుండా వెళ్లిపోయారు. అక్కడ ఉన్న విద్యార్థుల్ని నేను కోరేదేమంటే- నా ప్రశ్నలకు ఆయనను సమాధానమివ్వమనండి’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.
 
‘‘పార్లమెంట్‌లో అడగాల్సిన ప్రశ్నలను నేను ముందుగానే చెప్పేస్తున్నాను. 126 యుద్ధవిమానాలకు బదులు 36 జెట్సే ఎందుకు? యుద్ధవిమానం ఖరీదు రూ. 560 కోట్లకు బదులు రూ. 1600 కోట్లు ఎందుకయ్యింది? హాల్‌ బదులు అనిల్‌ అంబానీకి కాంట్రాక్ట్‌ ఎందుకిచ్చారు? రాఫెల్‌ ఫైళ్లను మనోహర్‌ పర్రీకర్‌ ఎందుకు తన బెడ్రూంలో అట్టేపెట్టుకున్నారు’’ అని రాహుల్‌ తన ప్రశ్నలను సంధించారు. ఇప్పుడు దేషంలో వీస్తున్న బీజేపీ వ్యతిరేక పవనాల తోడుగా ఇలా రాహుల్ ఇంకాస్త దూకుడు ప్రదర్శిస్తే కాంగ్రేస్ కొంతైనా బలపడే అవకాశాలున్నాయి.