మొదటి సంతకం హోదా పైనే: రాహుల్ హామీ, బలపరిచిన రఘువీరా

05:15 - January 12, 2019

ఏపీకి ప్రత్యేక హోదా ఈ ఒక్క అంశం దాదాపుగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అధికారాన్ని కూడా నిర్ణయించగల బలమైన అంశం. అసలు ఇక ప్రత్యేక హోదా రానట్టే అని సామాన్యుడు కూడా ఆ విషయాన్ని మర్చిపోతున్న సమయంలో మళ్ళీ ఏపీ ప్రజలకు హోదా పై ఆశలు కలిగించే వ్యాఖ్యలు చేసారు  ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి. రాష్ట్రానికి హోదా ఇవ్వకపోతే తాను రాష్ట్రంలో అడుగుపెట్టబోనని చెప్పారు. జనవరి 11 అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా రఘువీరా ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని అయ్యాక ఏపీ ప్రత్యేక హోదా అంశంపైనే తొలి సంతకం చేస్తారని చెప్పారు. 
"మేము అధికారంలోకి వచ్చి, రాహుల్‌ గాంధీ ప్రధాని అయిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేసి తీరుతాం. అమలు చేయలేకపోతే నా జీవితంలో శాశ్వతంగా ఏపీలో అడుగుపెట్టను. నా ఊర్లో కూడా అడుగు పెట్టను. నా ఇల్లు, ఆస్తులు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. 62 ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్నా" అని రఘువీరా అన్నారు. 


నిజానికి కాంగ్రేస్ హోదా విషయంలో అప్పుడే స్పష్టమిన హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ కూడా ఏపీకి హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చినతర్వాత హోదా ఇవ్వటం  సాధ్యంకాదని తేల్చి చెప్పింది. దీంతో ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటిన విషయం తెలిసిందే. ప్రత్యేక హక్కు ఆంద్రుడి హక్కు అంటూ నిరసనలు చేసినా ఇక ఫలితం ఉండదు అని ఆలస్యంగా అర్థమైన ప్రజలు నెమ్మదిగా మౌనం వహించారు. ఇక ఆశలు చాలించుకుంటున్న సమయం లో కాంగ్రేస్ మళ్ళీ ఈ హోదా అంశాన్ని పైకి తెచ్చింది. 

     ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా .. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఫైల్‌పైనే తొలి సంతకం చేస్తామని ప్రకటించారు. రెండురోజుల దుబాయ్ పర్యటనలో అక్కడ ఉన్న ప్రవాస భారతీయులను కలిసిన రాహుళ్ "రాష్ట్రం విడిపోయాక ఏపీకి కచ్చితంగా ఇవ్వాల్సిన ముఖ్యమైన హామీని ప్రధాని మరిచారు. ఏపీకి ఇవ్వాల్సిన రుణం గురించి మనమంతా కలిసి భారత ప్రభుత్వానికి, మోదీకి అర్థమయ్యేలా చెప్పాలి. గతేడాది మార్చిలో హోదా కోసం ఏపీకి చెందిన నాయకులు జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేశారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు" అని అన్నారు. 

దుబాయ్‌ అభివృద్ధిలో భారత కార్మికులు విశేష పాత్ర పోషిస్తున్నారని రాహుల్ ప్రశంసించారు. "ఇక్కడి ఎత్తైన భవనాలు, పెద్ద పెద్ద మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, రోడ్లు.. మీ శ్రమ, చెమటతోనే నిర్మితమయ్యాయి. మీరు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేది కాదు. భారత కార్మికుల వల్లే ప్రస్తుతం దుబాయ్‌ ప్రపంచంలోనే ఒక ప్రత్యేక నగరంగా ఉంది. అటు పేదరికంలో ఉన్న మీ ఆప్తులకూ మీరు అండగా ఉంటున్నారు. మీ అందరికీ అభినందనలు" అని రాహుల్‌ అన్నారు. మొత్తానికి ఏపీ జనాలకి మళ్ళీ ఆశలు కలిగించిన కంగ్రేస్ ఈ మాటమీద బలమైన విశ్వాసం చూరగొంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ పునరాలోచనలోపడొచ్చేమో.