ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుతో బీజేపీ కపటనీతి ప్రదర్శన: ఏచూరి

12:47 - December 28, 2018

లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు గురువారం ఆమోదం పొందింది. అంతకు ముందు సభలో బిల్లుపై వాడివేడీగా చర్చ జరిగింది. జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీకి బిల్లును పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసినా... మోడీ సర్కారు అందుకు ఒప్పుకోలేదు. అయితే ఈ విషియంపై సీపీఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ..ఈ విషయంలో ప్రభుత్వానికి ఎందుకంత ఆతృత అని ప్రశ్నించారు. ముస్లిం మహిళలకు తలాక్‌ సంబంధించిన ఆంశంలో ఏండ్లుగా అన్యాయం జరుగుతుందని అన్నారు. అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని పరిష్కరిస్తున్న పేరుతో మరింత వివాదాస్పదంగా మార్చేందుకు యత్నింస్తుందని ఆయన విమర్శించారు. అంతేకాదు కేరళలోని శబరిమలైకి మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పునిస్తే...అందుకు విరుద్ధంగా బీజేపీ ఆందోళనలు చేపటిన విషయాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో ముస్లిం మహిళల హక్కుల రక్షణ పేరిట ఎందుకు వేగంగా నిర్ణయం తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. అంటే మహిళా హక్కులపై బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ కపటనీతిని ప్రదర్శిస్తుందని ఆయన వివరించారు. బీజేపీకి మహిళా హక్కులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే...మహిళా రిజర్వేషన్‌ బిల్లును తక్షణమే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు కేవలం మత ప్రాతిపదికన ఓట్లు చీల్చడమే మోడీ సర్కారు ప్రధాన ఉద్ధేశ్యమని ఆరోపించారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లులో ఎన్నో ఇబ్బందికర అంశాలున్నాయని తెలిపారు. దానిలో సవరణలు చేయకపోతే ముస్లిం యువకులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారని చెప్పారు. పెళ్ళి అనేది ఇద్దరు వయోజన స్త్రీ, పురుషులకు సంబంధించిన విషయమని గుర్తుచేశారు. అందుకు సంబంధించిన విషయాన్ని సునిశితంగా పరిష్కరించాల్సి ఉంటుందని హెచ్చరించారు.