చంద్ర"కళ" తప్పిందా?: అవినీతి ఆరోపణల్లో అయ్యేయెస్

17:06 - January 5, 2019

ఓ రెండేళ్ళ కిందట లేడీ కలెక్టర్ చంద్రకళ అనే అయ్యేయెస్ అధికారి వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో గుర్తుందా? "ప్రజల సొమ్ము ఇది, సిగ్గుండక్కరలేదా?" అంటూ రోడ్డుమీదే కాంట్రాక్టర్లను ప్రశ్నించి వార్తల్లోకి ఎక్కారు. అప్పట్లో డైనమిక్ అయ్యేయెస్గా దేశం మొత్తం మారుమోగిన పేరు చంద్ర కళ IAS. కానీ రెండేళ్లలో చంద్ర"కళ" తప్పారా? లేక ఆమె మీద వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవా? మహిళా అధికారిణి ఇంటిమీద సీబీఐ దాడుల నేపథ్యం లో అందరి మనసుల్లోనూ తలెత్తుతున్న అనుమానాలివే... 
 తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారిణి చంద్రకళ ఇంటిపై సీబీఐ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ లో ఇసుక కుంభకోణం వ్యవహారంలో కేసు నమోదుచేసిన అధికారులు ఈరోజు యూపీ, తెలంగాణ లోని 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఇసుక మాఫియాతో కలిసి చంద్రకళ అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంలో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదుచేసిన అధికారులు తెలంగాణలోని కరీంనగర్ తో పాటు యూపీలోని 12 చోట్ల సోదాలు కొనసాగిస్తున్నారు.
                         నిజాయితీ గల ఐఏఎస్ అధికారిగా చంద్రకళలకు మంచి పేరు ఉంది.అందుకే ఆమె సిబిఐ టార్గెట్ కావడం పట్ల అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి పాల్పడే నాయకులే ఆమెను టార్గెట్ చేసి కేసులు వేశారని వారు ఆరోపిస్తున్నారు. యూపీ క్యాడర్ అధికారి అయిన తెలంగాణ తేజం చంద్రకళ యూపీలో మోసాలు చేస్తున్న కాంట్రాక్టర్లను హడలెత్తించారు. 2014లో నాసిరకం రోడ్లు వేసిన అధికారులను, కాంట్రాక్టర్లను పబ్లిగ్గా నిలదీసి సంచలనం సృష్టించారని చెబుతారు.ఓయూ నుంచి ఎంఏ పట్టా పుచ్చుకున్న చంద్రకళ 2008లో ఐఏఎస్ టాపర్ గా నిలిచారు. యూపీ కేడర్ కు ఆమెను కేటాయించారు.
                  బులంద్ షహర్, బిజ్నోర్, మీరట్ జిల్లాల కలెక్టర్ గా పని చేశారు. ఆమె స్వచ్చ భారత్ కోసం ఎంతగానో కృషి చేశారు. అవినీతి పై నిప్పులు చెరిగి సామాజిక మాధ్యమాల్లో చంద్రకళ పేరు సంపాదించుకున్నారు. డైనమిక్ ఆఫీసర్ గా ఆమెకు పేరుంది. బిజ్నోర్‌ను బహిరంగ మలవిసర్జనరహిత జిల్లాగా మార్చేందుకు ఆమె చేపట్టిన చర్యలు కేంద్ర సర్కారు ప్రశంసలు పొందాయి.ఇప్పుడామె నిజాయితీకి, కృషికి గుర్తింపుగా ప్రధాని నరేంద్రమోదీ ఆమెను తన డ్రీమ్‌ టీంలో చేర్చుకున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్‌గా, కేంద్ర తాగునీరు, పారిశుధ్ధ్య మంత్రిత్వశాఖ ఉపకార్యదర్శిగా నియమించారు. దీంతో ప్రస్తుతం మీరట్ కలెక్టర్‌గా ఉన్న చంద్రకళ ఢిల్లీకి మారింది.ఉత్తర్‌ప్రదేశ్ ఐఏఎస్ అధికారిగా అనేక సంచలనాలకు కేంద్ర బిందువైన చంద్రకళ.. కాంట్రాక్టర్ల అవినీతిని నిలదీసిన వైనం సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.  
              కానీ ఇప్పుడు ఆమె మీద వచ్చిన ఈ ఆరోపణలు విస్మయానికి గురి చేస్తున్నాయి. సంధర్భాన్ని బట్టి చూస్తే కొన్నేళ్ళకిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓబుళా పురం మైనింగ్ కేసులో కూడా శ్రీలక్ష్మి అనే అయ్యేయేస్ అధికారి కూడా ఇలాగే డైనమిక్ ఆఫీసర్ అన్న గుర్తింపు తెచ్చుకొని తర్వాత మైనిగ్ కంపెనీలకు సహాయంగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలను ఎదుర్కొని జైలుకు కూడా వెళ్ళారు. మరి ఇప్పుడు చంద్రకళ కూడా అలాగే అవ్వనున్నారా?