కేసీఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ అదేనా...?

14:03 - December 30, 2018

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ముందు.. ఆ త‌ర్వాత‌... ముఖ్య‌మంత్రి కేసీఆర్ నోటి వెంట ప‌దే ప‌దే ఓ ప‌దం అదే ప‌నిగా వెలువ‌డుతున్న‌ది. ఆ ప‌దం ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లోను, అటు మీడియాలోనూ చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. సామాజిక మాధ్య‌మాల్లోనూ వైర‌ల్ అవుతున్న‌ది. దీంతో జ‌నం కేసీఆర్ నోటి వెంట వెలువ‌డే ఆ మాట గురించి ప‌దే ప‌దే చ‌ర్చించుకుంటున్నారు. సస్పెన్స్‌ లేకుండా.. ఎలాంటి నాన్చుడూ లేకుండా విష‌యానికొస్తే... మ‌న సీఎం గారి నోటి వెంట వెలువ‌డే ఆ ప‌ద‌మే.. రిట‌ర్న్ గిఫ్ట్‌. అంటే ఒకరు బ‌హుమ‌తినిస్తే.. తిరిగి వారికి మ‌ళ్లీ బహుమ‌తిని ఇవ్వ‌ట‌మ‌న్న‌మాట‌. తాజాగా శ‌నివారం త‌న నివాస‌న‌మైన ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలోనూ కేసీఆర్ ఈ రిట‌ర్న్ గిఫ్ట్ గురించి మాట్లాడ‌టం గ‌మ‌నార్హం. దీని గురించి చెప్పుకోవాలంటే మ‌నం ముందు ముంద‌స్తు ఎన్నిక‌ల గురించి ముచ్చ‌టించుకోవాల్సిందే. ఇటీవ‌ల జ‌రిగిన శాస‌న‌స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేసీఆర్  ఊహించ‌ని విధంగా కాంగ్రెస్‌, టీడీపీ ఒక్క‌ట‌య్యాయి. టీఆర్ ఎస్‌ను ఓడించేందుకు టీజేఎస్‌, సీపీఐల‌తో క‌లిసి మ‌హాకూట‌మిని ఏర్పాటు చేశారు. ఇందులో చంద్ర‌బాబు కీల‌క పాత్ర పోషించారు. అంతేకాదు కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో క‌లిసి బాబుగారు అనేక స‌భ‌ల్లో పాల్గొన్నారు. ఇది మ‌న కారు సారుకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. సిద్ధాంతాల‌ను గాలి కొదిలేసిన రాహుల్‌, చంద్ర‌బాబు రాజ‌కీయ వ్య‌భిచారానికి పాల్ప‌డుతున్నారంటూ గులాబీ బాస్ దుమ్మెత్తి పోశారు. బాబు చ‌ర్య‌ల వ‌ల్ల అన్న ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంద‌ని హెచ్చ‌రించారు. ఆ త‌ర్వాత జ‌రిగిన  ఎన్నిక‌ల్లో మ‌హాకూట‌మి ఓడిపోవ‌టం, టీఆర్ ఎస్ భారీ మెజారిటీతో గెల‌వ‌టం మ‌న‌కంద‌రికీ తెలిసిందే. క‌థ ఇంత‌టితో అయిపోయింద‌నుకుంటే మ‌నం త‌ప్పులో కాలేసిన‌ట్టే. ఎన్నిక‌ల సంద‌ర్భంగా చంద్ర‌బాబు తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌టాన్ని ప‌దే ప‌దే విమ‌ర్శించిన సీఎం కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ ఓ విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పారు. బాబు తెలంగాణ ఎన్నిక‌ల్లో వేలు పెడుతుండు.. అందుకే మేం గూడ ఏపీ ఎన్నిక‌ల్లో, అక్క‌డి రాజ‌కీయాల్లో వేలు పెడ‌తం... చూస్తుండండి అంటూ స‌వాల్ విసిరారు. ఇక్కడికొచ్చి బాబు ... మాకు గిఫ్ట్ (అంటే టీఆర్ ఎస్ ను ఓడించ‌టం) ఇవ్వాల‌నుకుంటున్న‌డు.. మేం ఆడికిపోయి ఆయ‌న‌కే రిట‌ర్న గిఫ్ట్ (అంటే టీడీపీని ఓడించ‌టం) ఇస్తామంటూ తండ్రీ, త‌న‌యులు హెచ్చ‌రికల మీద హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇప్ప‌డు కేసీఆర్ ఇవ్వ‌బోయే ఈ రిట‌ర్న్ గిఫ్టే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిగ్గా మారింది. ఇక్కడే మ‌రో గ‌మ్మత్త‌యిన విష‌యం దాగుంద‌ని జ‌నాలు చెవులు కొరుక్కుంటున్నారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ప్ర‌చారం చేయ‌టం ద్వారా కేసీఆర్‌... తెలంగాణ సెంటిమెంటును రెచ్చ‌గొట్టి మ‌స్తుగా లాభ‌ప‌డ్డారు. ఇప్ప‌డు ఏపీ ఎన్నిక‌ల్లో కేసీఆర్ ప్ర‌చారం చేయ‌టం ద్వారా చంద్ర‌బాబు ఆంధ్రావారి ఆత్మాభిమాన్ని రెచ్చ‌గొట్టి లాభ‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే గుస‌గుస‌లు విన‌బ‌డుతున్నాయి. శ‌త్రువుకు శ‌త్రువు మిత్రుడ‌న్న‌ట్టు ఏపీలో చంద్ర‌బాబుకు, జ‌గ‌న్‌కు క్ష‌ణం కూడా ప‌డ‌దు. అందువ‌ల్ల చంద్ర‌బాబంటే గిట్ట‌ని జ‌గ‌న్ కేసీఆర్‌తో మంత‌నాలు జ‌రుపుతున్నారంటూ ఆ మ‌ధ్య వార్త‌లొచ్చాయి. కానీ ఇప్ప‌డు కేసీఆర్, కేటీఆర్ ఏపీకి వ‌స్తే త‌న‌కు న‌ష్టం జ‌రిగి.. చంద్ర‌బాబు లాభ‌ప‌డ‌తామోన‌న్న  భ‌యం జ‌గ‌న‌న్న‌ను వెంటాడుతున్న‌ది. అందుకే గులాబీ బాస్‌ను ఏపీకి రావ‌ద్దంటూ జ‌గ‌న్ వేడుకుంటున్నారంట‌. ద‌టీజ్ ద మేట‌ర్...