కేరళ "ఘోష": పెరుగుతున్న బాంబుదాడులు, 2,187 కేసులు, 6,914 మందిని అరెస్ట్

16:00 - January 8, 2019

నెమ్మదిగా సమసి పోతుందనుకున్న "శబరిమల వివాదం" మరింతగా రాజుకుంటూనే ఉంది. ఒక్కొక్క రోజు గడుస్తున్నకొద్దీ అక్కడి నిరసనలూ, ప్రతిఘటనలూ తీవ్రంగా మారుతున్నాయి. నిరసనలూ, ధర్నాలూ దాటి ఇప్పుడు ఏకంగా బాంబుదాడుల వరకూ వెళ్ళింది. ఇన్నిన్ని బాంబులు బయటకు వస్తూంటే పోలీసు అధికారులే అవాక్కవుతున్నారు. ఇవాళ తెల్లవారుజామున కొజికోడ్ జిల్లాలో సీపీఎం, బీజేపీ నాయకుల ఇళ్లపై దుండగులు నాటు బాంబులు విసిరారు. సీపీఎం కోయిలాండీ కమిటీ సభ్యుడు షిజు ఇంటిపై తొలుత దాడి జరగ్గా... కొద్దిసేపటికి ఇదే ప్రాంతంలోని బీజేపీ నేత వీకే ముకుంద ఇంటిపైనా నాటుబాంబులు పడ్డాయి. అయితే ఈ రెండు ఘటనల్లోనూ ఎవరికీ ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.
 
కాగా సోమవారం కూడా కోయిలాండే బీజేపీ నేత ఇంటిపై దుండగులు నాటుబాంబులతో దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు కాన్నూర్‌లో 18 నాటుబాంబులు స్వాధీనం చేసుకున్నారు. గత బుధవారం  40 యేళ్ల ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలో ప్రవేశించడంపై వారం రోజులుగా కేరళలో ఆందోళనలు వెల్లువెత్తాయి. మరుసటి రోజున పలు హిందూత్వ సంస్థలు కేరళ వ్యాప్తంగా బంద్ చేపట్టాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఉద్రిక్తతలకు కారణమైన వారిపై 2,187 కేసులు నమోదు కాగా... 6,914 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 

ఇప్పుడు తాజాగా భక్తి ముసుగులో హిందుత్వ శక్తులు కేరళలోని రోడ్లపైకి వచ్చి భయోత్పాన్ని సృష్టిస్తున్నాయి అన్న ఆరోపణలకు బలచేకూర్చే విధంగా రెండు రోజుల క్రితమె బాంబు విసురుతూ కెమెరాకు చిక్కాడు ఒక సంఘీయుడు. తిరువనంతపురంలోని నెడుమంగాడు పోలీస్ స్టేషన్ పై ఒక రాష్ట్రీయ స్వయం సేవకుడు(ఆర్ ఎస్ ఎస్ నాయకుడు) బహిరంగంగానే నాటుబాంబులతో దాడి చేయడం కలకలం రేపింది. అయితే ఎప్పుడు చూసినా మేము శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నామని సమర్థించుకునే ఆరెస్సెస్ ఇప్పుడు సరిగ్గ ఇరుక్కుంది.

  స్వయం సేవకుడు నాటుబాంబు విసిరిన దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో చక్కగా రికార్డయింది. దీంతో సంఘ్ పరివారాన్ని ప్రతిఒక్కరూ నిలదీస్తున్నారు. ఈ వీడియోను చూసినవారంతా ‘ఇప్పుడైనా మీరు ఒప్పుకుంటారా..మీరు అరాచకవాదులని’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆర్ ఎస్సెస్  ఏం చేయాలో అర్థంకాక ఎప్పటిలాగే ఆ వ్యక్తికి ఆర్ఎస్సెస్ కు ఎలాంటి సంబంధం లేదని పాతపాటేమొదలు పెట్టింది.