ఆకలివేసి "పురుగులమందు" తాగిన చిన్నారి: ఇదీ మన దేశం

17:44 - January 9, 2019

ప్రపంచ ప్రసిద్ది కట్టడాలున్న దేశం, అభివృద్ది పథలో పరిగెడుతున్న దేశం అగ్రదేశాలతో పోటీ పడి మరి ఎదుగుతున్న దేశం అంటూ మన నేతలు ఊదరగొడుతూనే ఉంటారు. ఆవులకు అంబులెన్సులు ఏర్పాటు చేసే మన దేశంలో ఇంకా ఇంకా మనిషి ఆకలి చావులు మాత్రం తప్పటం లేదు. వేలకోట్ల రూపాయలతో విగ్రహాలు పెడుతూనే బతుకున్న మనుషులని సమధుల్లో కప్పి పెడుతున్నాం. తినటానికి తిండి దొరక్క చేతికందిన పురుగులమందు తాగేశాడొక బాలుడు. ఇదీ మన దేశంలో జరిగిన సంఘటనే ఏ ఆఫ్రికన్ కరువుదేశాలలో జరగలేదు.
 
మధ్యప్రదేశ్‌లోని రట్లం జిల్లాలోని ఓ గ్రామనికి చెందిన 10 ఏళ్ల చిన్నారి ఆకలికి తట్టుకోలేక విషపూరిత పురుగుల మందు తాగాడు. దీంతో తీవ్ర అస్వస్థకు గురైన చిన్నారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్మన్ రాఘవేంద్ర శర్మ మాట్లాడుతూ "కొద్ది రోజులుగా ఇంట్లో తినడానికి ఏమీలేకపోవడంతో ఆకలికి తట్టుకోలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగానని ఆ బాలుడు తెలిపాడు. తమ కుటుంబానికి 19 బిఘాల భూమి ఉందని కూడా చెప్పాడు" అని అన్నారు.


ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ స్పందించి చిన్నారిని ఆసుపత్రిలో ఉన్న చిన్నారికి మరింత మెరుగైన వైద్యం అందేలా చర్యలు ప్రారంభించింది. అంతే కాకుండా సదరు గ్రామంలో పర్యటించి వివరాలు సేకరిస్తోంది. అయితే బాలుడి తల్లిదండ్రులు రాజస్థాన్‌లోని కోటాలో పని చేయడానికి వెళ్లారు. నెలనెలా కుటుంబానికి వచ్చే రేషన్‌ సరుకులతో చిన్నారి కడుపు నింపుకుంటాడని స్థానికులు తెలిపారు. కాగా, కోటా నుంచి తిరిగి వచ్చిన చిన్నారి తండ్రి ననురామ్ మాట్లాడుతూ "మా ఇంట్లో రేషన్ సరుకులు లేవు. కానీ, పరిపాలన యంత్రాంగం ఇట్లాంటి విషయాల్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది" అని వాపోయాడు.


   ఆకలికి మందుగా పురుగులమందు తాగిన ఆ చిన్నవాడిలా మరికొంతమంది మారే అవకాశమూ లేకపోలేదు. కనీసం ఈ సంఘటన అయినా బయటికి వచ్చింది. అసలు పత్రికలదాకా చేరని ఆకలి మరణాలు ఇంకెన్ని జరుగుతున్నాయో...