అన్నీ మనవేదాల్లోనే ఉన్నాయిష:ఆంధ్రా యూనివర్సిటీ వీసీ గ్.నాగేశ్వర్ రావు

12:27 - January 5, 2019

"అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిష" గురజాడ వారు ఏ క్షణాన కన్యాశుల్కం నాటకంలో ఈమాట వాడారో గానీ ఏమాత్రం అవకాశం వచ్చినా మనవాళ్ళు ఆ వేదాల సారాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయటం మాత్రం ఆపటం లేదు. ఆనాటి పుష్పక విమాన వర్ణన చూపించి ఇదే మన ఏరోనాటికల్ టెక్నాలజీ అనీ, అణుటెక్నాలజీ అంతా అప్పట్లోనే ఉందనీ, ఇంకో అడుగు ముందేసి దివ్యదృష్టిని గూగుల్ తో కలిపేసి మరీ అంతా అప్పట్లోనే ఉందని చెప్పేస్తున్నారు. మరీ ఇలా చెప్పేది మామూలు జనం కాదు, ఇలా అశాస్త్రీయంగా మాట్లాడేవాళ్ళలో శాస్త్రవేత్తలూ, యూనివర్సిటీ ఫ్రొఫెసర్లూ ఉండటమే కాస్త వింతగా ఉంది.  

  తాజాగా ఇంకో సారి ఇలాంటి వింత వాదన వినిపించింది అదీ పంజాబ్ రాష్ట్రం జలంధర్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్సీ) సాక్షిగా ఆంధ్రా యూనివర్సిటీ వీసీ జీ.నాగేశ్వర్ రావు పైతరహా వ్యాఖ్యలు చేసారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జీ నాగేశ్వర్ రావు ప్రసంగిస్తూ. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతం కంటే విష్ణుమూర్తి దశావతారాలు ఎంతో ప్రాచీనమైనవనీ. ఆనాడు శత్రు సంహారం కోసం శ్రీరాముడు శస్ర్తాలను ఉపయోగిస్తే, విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించారని, నిర్దేశిత లక్ష్యాన్ని చేదించిన తరాత మళ్ళీ ఇవి వెనక్కి తిరిగివచ్చేవనీ  దీన్నిబట్టి చూస్తే గైడెడ్ క్షిపణులు భారత్ కు కొత్త కాదని. వేల సంవత్సరాల కిందటే భారత్ లో ఎన్నో అద్బుతాలు జరిగాయనీ చెప్పారు. 

ఇక ఏరోనాటిక్స్ గురించి వివరిస్తూ కూడా రావణుడి వద్ద కేవలం పుష్పక విమానం మాత్రమే కాకుండా వేర్వేరు పరిమాణాలు, సామర్ధ్యాలతో కూడిన 24 రకాల విమానాలు ఉండేవని, ఈ విమానాలను ఆయన విభిన్న ప్రయోజనాల కోసం ఉపయోగించేవారని, చెప్పిన ఆయన  లంకలో అనేక విమానాశ్రయాలు కూడా ఉండేవని రామాయణం పేర్కొంటున్నదన్నారు. మొదటగా జీవం పుట్టింది నీటినుంచే అన్న సిద్దాంతన్ని గుర్తు చేసిన ఆయన మన పురాణాల్లో విష్ణుమూర్తి మొదటి అవతారం కూడా మత్స్యావతారమేనని వ్యాఖ్యానించారు. 
ఇక మహాభారతంలోని కౌరవ జననం స్టెం సెల్ ద్వారా జరిగిన అద్బుతమనీ మహాభారతంలోని కౌరవులు మూలకణం  ద్వారా జన్మించారని, వారంతా టెస్ట్‌ట్యూబ్ బేబీలని చెప్పారు. అయితే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ల్యాబ్ లోనే అండమూ శుక్రకణమూ ఫలదీకరణ చెందుతాయి అన్న విషయం ఇంత పెద్ద యూనివర్సిటీ ఉపకులపతికే తెలియదా?  అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.