అన్నయ్యని బలహీనున్ని చేసారు, రాత్రికి రాత్రే ఎవరూ ఎదగలేరు: పవన్ కళ్యాణ్

04:16 - January 6, 2019

మళ్ళీ ఒకసారి ప్ర‌జారాజ్యం పార్టీ ఏర్పాటు రోజుల విషయాలను గుర్తు చేసారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పీఆర్పీ ల‌క్ష్యం, ఆ పార్టీని నడిపించటానికి చిరంజీవి పడిన క‌ష్టం ఎలాంటిదో చెప్తూనే, ఆనాడు పార్టీలో ఎటువంటి వారు చేరి న‌ష్టం చేసారు వంటి అంశాలను గుర్తు చేసుకొనిమరీ ఆవేద‌న వ్య‌క్తం చేసారు. అంతే ఆవేశంగా వచ్చే ఎన్నికల్లో జనసేన 60 శాతం మంది కొత్తవారిని బరిలోకి దింపుతుంద‌ని కూడా ప్ర‌క‌టించారు.
 చిత్తూరు, ప్రకాశం జిల్లాల నేతలతో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాన్ తమను రాజకీయ పార్టీగా గుర్తించడానికి ఇష్టపడని వైసీపీ, టీడీపీలు జనసేనతో పొత్తు పెట్టుకున్నామని ప్రచారం చేసుకునే స్థాయికి వెళ్లాయంటే నైతికంగా తమకు తొలి విజయం దక్కినట్టేనని, అనుకోకుండానే సామాన్యులు ఉపయోగించే గ్లాసు ఎన్నికల గుర్తుగా వచ్చిందని చెబుతూ కాలం జనసేనకు అనుకూలంగా ఉందనడానికి ఇదే ఉదాహరణ అన్నారు. 

రిస్క్ చేయకపోతే కొత్తదనం రాదని, అటువంటి రిస్క్ జనసేన పార్టీ చేస్తుందని,. రాబోయే ఎన్నికలు మొదటివో, చివరివో కావని. ప్రారంభం మాత్రమేనన్నారు. డబ్బు ప్రభావం లేని రాజకీయాలు చేయాలన్న లక్ష్యంతోనే మా పార్టీ ఏర్పాటైంది. ఎన్నికల కోసం రూ.2వేల కోట్లు అవసరమంటున్నారు  కానీ డబ్బుతో పనిలేని రాజకీయాలను బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరాం చూపించారని చెప్పిన పవన్. అన్నగారి పార్టీ అయిన పీఆర్పీ మీద మరోసారి తన ప్రేమని నిరూపించుకున్నారు.

                         ప్రజారాజ్యం పార్టీని గనక నిలబెట్టుకొని ఉంటే  సామాజిక న్యాయం జరిగి ఉండేదని, కానీ అనాడు పార్టీలో చేరిన ఓపిక లేని నాయకుల వల్లే ఆ మహత్తర అవకాశం చేజారిందని ఆవేదన వ్యక్తం చేసిన పవన్. పీఆర్పీ ఏర్పాటులో బలమైన పాత్ర పోషించానని, చిరంజీవికి ప్రేరణ కలిగించిన వారిలో తాను ఒకడినని పవన్ చెప్పు కొచ్చారు. ప్ర‌జా రాజ్యంలో చేరిన‌ నేతలు పదవీ వ్యామోహంతో. చిరంజీవిలాంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చారని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని, పెన్షన్లు, రేషన్‌ కార్డులు వంటి సమస్యలను పరిష్కరించే ఓపిక నేతల్లో లేదని చెప్పారు. 
  2014లో రాష్ట్ర సమగ్రత కోసం తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసినా 2019 ఎన్నికల్లో మాత్రం "రాష్ట్రంలో సమతుల్యతకోసం" ఒంటరిగా పోటీ చేస్తున్నామని, వ్యక్తిగతంగా ప్రజాబలం ఉన్న వ్యక్తులు జనసేనలోకి వస్తే. వారికి జనసేన బలం తోడై విజయానికి చేరువవుతారని, అలాంటి వారికి తన బలం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అయితే ఇంత ఆవేదనా వెలిబుచ్చిన పవన్ కళ్యాన్ మళ్ళీ రాత్రికి రాత్రే రాజకీయాల్లో ఎవరూ ఎదగలేరని. కనీసం పాతిక సంవత్సరాలు ఓపిక పట్టాలన్నారు. అంటే మరో పాతికేళ్ళపాటు ఆధికారంలో ఉంచండీ అని చెప్పినట్టేనా?