అట్టుడుకుతున్న కేరళ: బాంబుదాడులతో దద్దరిల్లిన కానూర్

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కేరళలో మొదలైన ఘర్షణలు పతాక స్థాయికి చేరకున్నాయి. కేరళలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాటి కేరళ పర్యటన వాయిదాపడింది. జనవరి 2న ఇద్దరు 50 ఏళ్ల లోపు మహిళల శబరిమల ఆలయ ప్రవేశాన్ని నిరసిస్తూ అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. హిందూ సంఘాలకు చెందిన ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులు, సీపీఎం కార్యకర్తల ఆస్తులపై దాడులకు పాల్పడుతూ హింసాత్మక ఆందోళనలు చేపడుతున్నారు.
అధికార, విపక్షాలకు చెందిన పార్టీలు పరస్పర దాడులకు పాల్పడుతుండడంతో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి.ఇప్పటి వరకు 1,369 మందిని అరెస్టు చేసిన పోలీసులు, 717 మందిని ముందస్తుగా పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. హింసాత్మక ఘటనకు సంబంధించి 801 కేసులు నమోదయ్యాయి. హింసాత్మక ఘటనల్లో ఓ వ్యక్తి మృతి చెందగా పలువురు గాయపడ్డారు. చంద్రన్ ఉన్నితన్(55) మృతి చెందిన ఘటనకు సంబంధించి ఇద్దరు సీపీఎం కార్యకర్తలను అరెస్టు చేశారు. సీపీఎం కార్యకర్తలు విసిరిన రాయి తగిన చంద్రన్ మృతి చెందినట్లు హిందూ సంఘాలు ఆరోపిస్తుండగా...ఇందులో వాస్తవం లేదని, గుండెపోటు కారణంగా చంద్రన్ మృతిచెందినట్లు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.
సీపీఎం నేతలు ఏఎన్ షంసీర్, పి. శశి నివాసాలు సహా పలు ప్రాంతాల్లో కొందరు గుర్తు తెలియని దుండగులు నాటుబాంబులు విసిరారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.‘గుర్తుతెలియని కొందరు వ్యక్తులు రాత్రి 10:15 సమయంలో బైక్‌లపై వచ్చి షంసీర్ ఇంటిపై బాంబు విసిరారు. కానూర్ జిల్లా తలస్సేరి సమీపంలోని మదపీడికాయిల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది.’ అని పోలీసులు వెల్లడించారు. కాగా ఈ దాడులు ఆర్ఎస్ఎస్ పనేనంటూ షంసీర్ ఆరోపించారు. కాగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పతనంతిట్ట జిల్లాలోని పందాళం, ఆదూర్, కోడుమాన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిషేదాజ్ఞలు విధించినట్టు సమాచారం.