"అగ్రవర్ణ రిజర్వేషన్" అమలు సాధ్యమయ్యేనా?: ప్రముఖుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి

06:23 - January 9, 2019

భారత దేశం లో ఇప్పటివరకూ లేని విధంగా "అగ్రవర్ణ పేదలకు" రిజర్వేషన్లు వర్తింపచేయాలని కేంద్ర ప్రభుత్వంతీసుకున్న నిర్ణయం మీద మిశ్రమ స్పందన వస్తోంది.  వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉన్న అగ్ర వర్ణాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమలు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ బిల్లుతో 2019 ఎన్నికల్లో అన్ని వర్గాలనూ ఆకట్టుకోవాలన్న బీజేపీ వ్యూహం మాత్రం ఫలించేలా లేదు. ఇప్పటికే వివిధ వర్గాలనుంచీ వ్యతిరేకత మొదలయ్యింది. కానీ కొన్ని రాజకెయ పార్టీలు మాత్రం ఈ బిల్లుని సమర్థిస్తూ తాము మద్దతుగా ఉన్నామంటూ ప్రకటనలు చేస్తున్నాయి. ఇంతకీ ఈ బిల్లు అమలు సాధ్యమేనా? ఎవరు ఏ,అంటున్నారు అంటే... 
 
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా వినిపిస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లో కాపు, గుజరాత్‌లో పటేళ్లు, మహారాష్ట్రలో మరాఠాలు, రాజస్థాన్‌లో జాట్‌లు ఇలా చాలా రాష్ట్రాల్లోని అగ్రవర్ణాలు రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం షెడ్యూల్డ్ కులాలకు 15 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 7.5 శాతం, ఇతర వెనకబడిన వర్గాలకు 27 శాతం మొత్తంగా 49.5 శాతం రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 1991లో పీవీ నర్సింహారావు ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు.రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రీంకోర్ట్ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పును అధిగమించి కేంద్రం ఏ విధంగా రిజర్వేషన్లను అమలు చేస్తుందనేది కీలకంగా మారింది.


ఈ నిర్ణయం పై ఎవరేమంటున్నారంటే.... 

"కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే. కానీ దీని వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం మంచిది కాదు. సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది రాజకీయ ఎత్తుగడగానే కనిపిస్తోంది. మరింత ముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేది." - మాయావతి (బీఎస్పీ అధినేత్రి, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి) 

‘‘ఆర్థిక బలహీనవర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు పది శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని మేం సమర్పిస్తున్నాం! అదే సమయంలో వాల్మీకులను ఎస్టీలుగా, రజకులను ఎస్సీలుగా ప్రకటించాలని... కాపులను బీసీలుగా పరిగణించి రిజర్వేషన్‌ కల్పించాలని రాష్ట్రం పంపిన బిల్లులను కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి’’  చంద్రబాబు  నాయడు (ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ఖ్యమంత్రి)

 "కాపులను బీసీల జాబితాలో చేర్చి 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మేం పోరాటం చేస్తున్నాం. కేంద్ర నిర్ణయం వల్ల మాకు ఏ ప్రయోజనం లేదు. అగ్రకుల రిజర్వేషన్ల జాబితాలో కాపులను చేర్చితే వచ్చే ఉపయోగమూ లేదు" ముద్రగడ పద్మనాభం (కాపు ఉద్యమ నేత ) 

"కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మంచి పరిణామంగానే చెప్పుకోవాలి. మొదట ఎస్సీ,ఎస్టీలకే రిజర్వేషన్లు అమలు చేశారు. ఆ తర్వాత 1990లలో బీసీలకు రిజర్వేష్లను వర్తింప చేశారు. కాలానుగుణంగా రిజర్వేష్లను కూడా మారాలి. అప్పుడే రాజ్యాంగం చెప్పిన సమానత్వం అనే భావన నిజం అవుతుంది'" వేంకటేశ్వర్లు (ఉస్మానియా యూనివర్సిటీ న్యాయవిభాగం అధిపతి) 
ఆలస్యమైనా అగ్రవర్ణ పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఆర్థికంగా వెనకబడిన వారికి ఈ బిల్లుతో ఎంతో ప్రయోజనమన్నారు. అయితే 10 శాతం రిజర్వేషన్లతో సమస్య పరిష్కారం కాదు, రాష్ర్టాలను బట్టి పరిస్థితులు మారుతుంటాయి. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసినా కేంద్రం పట్టించుకోలేదు. తమిళనాడులో 69 శాతం అమలవుతున్నట్లే తెలంగాణలో కూడా అనుమతించాలి"  జితేందర్ రెడ్డి  (టీఆర్ఎస్ ఎంపీ)

"ఈ నిర్ణయం వంద శాతం అమలవుతుందని ఆశిస్తున్నాం. దీని వల్ల దేశంలో ఉన్న కోట్లాది మంది అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూరుతుంది. సామాజిక వివక్షే కాదు, ఆర్థిక వెనకబాటును ప్రాతిపాదికను తీసుకొని రిజర్వేషన్లు ఇవ్వాలని మేం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లతో పాటతు జాతీయ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలి. అప్పుడే రిజర్వేషన్ల ఉద్యమాలు బలహీన పడతాయి"  కరుణాకర్ రెడ్డి (ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు)

"పేదరిక నిర్మూలన కోసం ఆర్ధిక పథకాలు ఎన్నో ఉన్నాయని మీరే అంటున్నారు.వాటిని అమలు పరచి అగ్రకులాలలోని పేదలను అభివృద్ధిచేయండి. వెనుకబాటు తనం, తక్కువతనం పోగొట్టటానికి పీడిత కులాలకు రాజ్యాంగం ఉద్దేశించిన రిజర్వేషన్లను అగ్రకులాలకు కల్పించి రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించకండి. ఇదేదీ కాదంటే జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని కులాలకూ రిజర్వేషన్లు వర్తింపజేయండి. ఈ 10% కు మరో 5% చేర్చి అగ్రకులాలకు రిజర్వేషన్లు కల్పించండి. మిగిలిన 85శాతం మిగిలిన వారికి  కల్పించండి.ఆ మేరకు రాజ్యాంగ సవరణజేయండి.అది చేసే దమ్ము మీకుందా? ఇది మోడీ అండ్ పార్టీకి పీడిత కులాలప్రశ్న. ఈ దేశ బహుజనుల సూటి ప్రశ్న" గుంటూరు లక్ష్మీ నర్సయ్య (కవీ, సామాజిక ఉధ్యమ కారులు)

భూముల్ని జాతీయం చేయమంటే చెయ్యరు. పబ్లిక్ సెక్టార్ ని రక్షించమంటే చెయ్యరు.  పార్లమెంటరీ రాజకీయాల్ని ప్రజల పరం చేసేందుకు, శతాబ్దాల వెట్టిని తిరస్కరిస్తూ, సమానత్వం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టిన ప్రాతినిధ్యం అనేదాన్ని పాలకులు అనబడేవాళ్ళు దుర్మార్గంగా వంచిస్తున్నారు. అందులో భాగమే మోడీ  ఇప్పుడు వచిస్తున్న ఈ 10 శాతం అగ్రవర్ణ పేదల కి రిజర్వేషన్లు.కుల పరమైన అణచివేతని, వివక్షని ప్రాతినిధ్యం ద్వారా కిందికులాలు అధిగమించి సమానత్వానికి చేరుకుంటారు అన్న మాటని, అప్పటి నుంచీ పాలకులు దాన్ని " రిజర్వేషన్లు' కి కుదించారు.అగ్ర కులాల పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో న్యాయం ఎంత ఉందో, దుర్మార్గ సామాజిక వివక్షని కొనసాగనించడం అంతకంటే  కొన్ని వందల రెట్లు అన్యాయం. 
డాక్టర్. నూకతోటి రవికుమార్, బహుజన రచయితల వేదిక - ఏపీ

అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని బాబాసాహెబ్ రాజ్యాంగంలో రాయడం వలనే 'మండల్ కమిషన్' ఏర్పడి రిజర్వేషన్లకు సిఫారసు చేసింది. (ఇకనైనా అంబేద్కర్ మీద ఏడవడం మానేయ్యండి.) అయితే జనాభా ప్రాతిపదికన ఇవ్వకుండా పాలకకులాలు/వర్గాలు/ కుట్ర చేశాయి. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ నేటి వరకు రిజర్వేషన్లను పెంచలేదు. ఇప్పుడు ఎలాగూ పెంచుతున్నారు గనుక ఎవరి న్యాయపరమైన వాటా వారు అడగవలసిన సమయం ఇదే. రిజర్వేషన్ ఫలాలు అందని కులాలు అన్నీ వాటి వాటికోసం డిమాండ్ చేసి సాధించేందుకు ఇదే మంచి తరుణం. ఈ డిమాండ్ ప్రజలనుండి వస్తే ఆయా కులాల వ్యాన్ గార్డ్ లుగా పాలకవర్గాలు దగ్గర లాబీ చేస్తున్న నాయకులు పోయి కొత్తతరం నాయకత్వం వస్తుంది. - అరుణాంక్ లత  (కవీ, న్యాయ విద్యార్ధి, హక్కుల ఉద్యమకారుడు)   
  ఇలా రకరకాల వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి అయితే వ్యతిరేకంగా వచ్చిన విమర్షలు పక్కనపెట్టినా మద్దతు తెలుపుతున్న వారు కూడా అమలు జరిపే విషయంలో కొంత అనుమానంతోనే ఉన్నారు.